భారతదేశంలో సమకాలిన వ్యవసాయం, ఆగ్రో ఎకనామిక్స్ - సవాళ్ళు & దృక్కోణాలు
- NRR Research Center
- Sep 29, 2024
- 2 min read
సెప్టెంబరు 29వ తేదీ నీలం రాజశేఖర్ రెడ్డి అధ్యయన కేంద్రంలో "భారతదేశంలో సమకాలీన వ్యవసాయ పరిస్థితి- సమస్యలు, పరిష్కారాలు -వ్యవసాయ ఆర్థిక విశ్లేషణ " అనే అంశంపై సెమినార్ నిర్వహించబడింది. అధ్యయన కేంద్ర డైరెక్టర్ డా. సురేష్ బాబు గారి అధ్యక్షతన జరిగిన సదస్సులో వ్యవసాయ ఆర్థికవేతలు, రైతు సంఘాల నాయకులు, మహిళలు, యువకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తన ప్రారంబోపన్యాసంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్ర నిపుణులు, ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు ప్రసంగిస్తూ దేశంలో ఆహార సమస్య ,రైతుల దుస్థితికి గల కారణాలను సువివరంగా వివరించారు. దేశంలో ఈనాటికి కూడా అధిక శాతం సాగు ధనిక, మధ్యతరగతి రైతుల మధ్య ఉందని 85 శాతం గానున్న చిన్న రైతులు, వ్యవసాయ కూలీలకు తక్కువ భూమి కలదని పేర్కొన్నారు. ఈరోజు రైతు ఆత్మహత్యలకు కారణం రైతు పండించిన పంటలకు న్యాయంగా రావలసిన ఆదాయం దక్కకపోవడమేనని పేర్కొన్నారు.
ప్రముఖ రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు ప్రసంగిస్తూ చిన్న రైతులకు అనుకూలంగా ఉండి ఋణ,మార్కెటింగ్, రీసెర్చ్ విధానాలను రూపొందించాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మూడు సంవత్సరాల క్రితం జరిపిన వీరోచత పోరాటాన్ని పేర్కొంటూ, రైతాంగం ఐక్యంగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా, గిట్టుబాటు ధరలపై ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ సదస్సు కొన్ని నిర్దిష్టమయిన న ప్రతిపాదనలతో ఒక మెము రాండంను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త (ICAR) డాక్టర్ శరత్ బాబు ప్రసంగిస్తూ దేశంలోని వృక్ష జన్యు సంపద, దేశంలో వంగడాల రూపకల్పన కు కాకుండా అదాని, రాందేవ్ బాబా పతాంజలి వంటి కంపెనీలు ఎలా మోసగిస్తున్నాయో వివరించారు. దేశవృక్ష జన్యు సంపద ను పరిరక్షించుకోవాలని కోరారు.
హైదరాబాదు యూనివర్సిటీ ఆర్థికవేత్త ప్రొఫెసర్ నరేష్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందని, గ్రామాలు, పట్టణాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.
ప్రముఖ బయోటెక్నాలజీ ICAR శాస్త్రవేత్త డా. సోమమర్ల ప్రసంగిస్తూ దేశంలో 60% గానున్న గ్రామీణ జనాభాకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అతి తక్కువగా ఉన్నాయని, అవి క్రమంగా తగ్గుతూ పోతున్నాయని, దేశంలో వాడికి భూమిని ఇచ్చే భూసంస్కరణ నిజాయితీగా అమలు చేసి బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు ఘనంగా పెంచాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుత పంటల సాగు పద్ధతులు ,పర్యావరణ సంక్షోభానికి కారణం అవుతున్నాయని పేర్కొంటూ వరి, ప్రత్తి.సాగు ను తగ్గించి వాటి స్థానంలో నీరును, పెట్టుబడు లను తక్కువగా వినియోగించే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు సాగు చేసే పంటల విధానం అమలు కావాలని కోరారు.
మధ్యాహ్నభోజన అనంతరం జరిగిన చర్చను వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కె.పూర్ణచంద్రరావు గారు ప్రారంభించారు. ఆయన వ్యవసాయరంగం ఈరోజు ఎదుర్కొంటున్న పలు సమస్యలు గురించి వివరిస్తూ, ప్రభుత్వం మీద ఉమ్మడి రైతు ఉద్యమాల ద్వార వత్తిడి తీసుకు రావాల్సిన తక్షణం ఆవశ్యకత ఉందన్నారు. చర్చలో అనేకమంది రైతు నాయకులు యువ రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రైతు కూలీ సంఘం నాయకులు శ్రీమతి. ఝాన్సీ గారు ప్రసంగిస్తూ ప్రస్తుత గ్రామీణ దుస్థితికి పాలకులు చేస్తున్న భూస్వామ్య కార్పొరేట్ ప్రజాస్వామ విధానాలే కారణమని పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు ఈ సంక్షోభాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించాలని కోరారు.
విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అరిబండి ప్రసాదరావు గారు, సహకార వ్యవసాయ సంఘాల ఉద్యమ నేత నైనాని గోవర్ధన్ గారు, కిసాన్ సభ నాయకులు రామకృష్ణారెడ్డి, కామ్రేడ్ ప్రభు లింగం గారు తదితరులు ప్రసంగించారు.
నీలం రాజశేఖర్ రెడ్డి అధ్యయన కేంద్ర డైరెక్టర్ డాక్టర్ సురేష్ బాబు గారి వందన సమర్పణతో సదస్సు ముగిసింది.






Comentarios